Thursday 18 August 2011

వరలక్ష్మీవ్రతం-కథ



లక్ష్మీం క్షీర సముద్రరాజ తనయాం1 శ్రీ రంగథామేశ్వరీం
దాసీభూత సమస్త దేవ వనితాం1 లోకైక దీపాంకురాం1
శ్రీ మన్మంద కటాక్ష లబ్ధ విభవః 1 బ్రహ్మేంద్ర గంగాధం 1
త్వాం త్రైలోక్య కుటుంబినీం సరసిజాం వందేముకుందప్రియామ్” 2
అంటూ శ్రీ వరలక్ష్మీ వ్రతం నాడు శ్రీ మహాలక్ష్మిని ధ్యానించిన వారికి సుఖసంతోషాలు చేకూరుతాయని పురోహితులు అంటున్నారు. మహిమాన్వితమైన “శ్రీ వరలక్ష్మీ” వ్రత పుణ్యదినాన సూర్యోదయానికి ముందే లేచి (ఐదుగంటలకు), అభ్యంగన స్నానమాచరించి, నూతన వస్త్ర ధారణ చేయాలి.
తదనంతరం పూజామందిరమును, ఇంటిని శుభ్రం చేసుకుని, గడపకు పసుపు కుంకుమ, గుమ్మానికి తోరణాలు, పూజా మందిరాన్ని పద్మం ముగ్గులతో రంగవల్లికలను తీర్చిదిద్దాలి. దానిపై పసుపు రాసి ముగ్గులు బొట్లు పెట్టుకున్న పీటను ఉంచి ఆ పీటపై నూతన వస్త్రము పరచి, బియ్యము పోసి, దానిపై అలంకరించిన కలశచెంబును ఉంచాలి.
ఒక కొబ్బరికాయను తీసుకుని దానికి “శ్రీ వరలక్ష్మీ” రూపు ప్రతిబింబించేటట్లు పసుపు ముద్దతో కనులు, ముక్కు, చెవులు మున్నగునవి తీర్చిదిద్దుకోవాలి. కుంకుమ, కనులకు కాటుకలను అమర్చి ఆ రూపును కలశపై ఉంచుకోవాలి.
ఆ తర్వాత ఆకుపచ్చని చీరతో కూర్చున్న లక్ష్మీదేవి ఫోటోను గానీ, ప్రతిమ (వీలైతే వెండిది)ను గానీ పసుపు కుంకుమలతో అలంకరించుకుని పూజకు సిద్ధం సుకోవాలి. పూజకు ఎర్రటి అక్షింతలు, పద్మములు, ఎర్రటి కలువ పువ్వులు, గులాబి పువ్వులు, నైవేద్యమునకు బొంబాయి రవ్వతో కేసరి బాత్, రవ్వలడ్డులు, జామకాయలు వంటివి సిద్ధం చేసుకోవాలి. పూజగదిలో రెండు వెండి దీపాలలో ఆరేసి ఆరేసి మొత్తం 12 తామర వత్తులతో నేతితో దీపమెలిగించాలి.
ఇకపోతే.. సాయంత్రం ఆరుగంటల నుంచి పూజను ప్రారంభించాలి. నుదుట కుంకుమ బొట్టు పెట్టుకుని, మెడలో తామర మాల ధరించి పూజను ఆరంభించాలి. శ్రీ లక్ష్మి సహస్రనామము, వరలక్ష్మీ వ్రత కథ పారాయణ చేసి, “ఓం మహాలక్ష్మీదేవ్యై నమః” అనే మంత్రాన్ని 108 సార్లు జపించాలి. వీలైతే లక్ష్మీ అష్టోత్తరము, మహాలక్ష్మి అష్టకములను పఠించి, తదనంతరం నైవేద్యములను సమర్పించుకుని దేవదేవికి దీపారాధన చేయాలి.
పూజ పూర్తయిన తర్వాత ఇరుగు పొరుగు ముత్తైదువులను పిలుచుకుని దక్షిణ తాంబూలాలు ఇచ్చుకోవాలి. స్త్రీలకు తాంబూలముతో పాటు వరలక్ష్మీ వ్రత పుస్తకాలను కూడా అందజేయాలి.
వరలక్ష్మీ వ్రత పర్వదినమున అష్టలక్ష్మీ దేవాలయములతో పాటు లక్ష్మీదేవీ ఆలయాలను దర్శించుకుంటే కోటి జన్మల పుణ్యఫలం లభిస్తుందని పురోహితులు అంటున్నారు. ఇంకా దేవాలయాల్లో శ్రీ లక్ష్మీ కుంకుమ పూజ, శ్రీ లక్ష్మీ అష్టోత్తరనామ పూజలు, పంచామృతములతో అభిషేకం చేయించడం సకల భోగభాగ్యాలను ప్రసాదిస్తుంది.
శుక్రవారం పూటే వచ్చిన శ్రీ వరలక్ష్మీ వ్రత దినాన నిష్టతో లక్ష్మిదేవిని పూజించే వారికి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని పురోహితులు అంటున్నారు. ఆ రోజున స్త్రీలు వరలక్ష్మి భక్తి శ్రద్ధలతో ప్రార్థిస్తే దీర్ఘసుమంగళీ ప్రాప్తం చేకూరుతుందని విశ్వాసం. అందుచేత శుక్రవారం వచ్చిన శ్రీ వరలక్ష్మీ వ్రత పుణ్య దినాన్ని విశేషంగా జరుపుకుందాం..
“సుమనస వందిత, సుందరి, మాధవి చంద్రసహోదరి హేమమయే
మునిగణ మండిత, మోక్షప్రదాయని మంజుల భాషిణి, వేదనుతే
పంకజవాసిని, దేవసుపూజిత సద్గుణ వర్షిణి, శాంతియుతే,
జయ, జయ, హేమధుసూదన కామిని ఆదిలక్ష్మీ జయపాలయమాం” 2
అంటూ పై మంత్రముతో ఆ ఆదిలక్ష్మిని ధ్యానము చేసుకుని, వరలక్ష్మీ వ్రత మహాత్మ్యంను తెలుసుకుందాం.
అమ్మవారి పూజలో అంతరార్ఱమిదీ..
ఒకసారి కైలాస పర్వతమందు వజ్రవైఢూర్యాది మణులతో పొదగబడిన సింహాసనముపై పార్వతీ పరమేశ్వరులు సుఖాసీనులై ఉన్న సమయాన.. “పార్వతి” ఓ ప్రాణనాధా! లోకమున స్త్రీలు ఏ వ్రతాన్ని ఆచరిస్తే సర్వసౌభాగ్యంబులును, పుత్రపౌత్రాదులతో సుఖంబుగా నుందురో అట్టి వ్రతాన్ని గురించి వివరించాల్సిందిగా ప్రార్థిస్తుంది.
ప్రజాహితము కోరి నీవడిగిన సంశయమును తీర్చెదనంటూ పరమేశ్వరుడు “శ్రీ వరలక్ష్మీ” వ్రతమును గురించి ఈ క్రింది విధముగా చెప్పుకొచ్చాడు. శ్రావణమాసమున శుక్లపక్ష పూర్ణిమకు ముందుగా వచ్చే “శుక్రవారం” నాడు ఈ వ్రతాన్ని భక్తిశ్రద్ధలతో ఆచరిస్తే.. సకల భోగభాగ్యాలు సిద్ధిస్తాయని పరమేశ్వరుడు పేర్కొన్నాడు.
పూర్వము మగధదేశమున “కుండినంబు” అనే పట్టణము ఉండేది. ఆ పట్టణమంతయు బంగారు ప్రాకారములతో నిర్మించబడి ఉంటుంది. ఆ పట్టణములో నారీ శిరోమణి అయిన “చారుమతి” అను మహా పత్రివ్రతయైన బ్రాహ్మణ స్త్రీ ఉండేది. ఆమె ప్రతినిత్యం గృహస్థు ధర్మాన్ని ఆదర్శవంతంగా నిర్వహిస్తూ భర్తను, అత్తమామలను సేవిస్తూ ఉండేది.
అంతేగాకుండా.. మహాలక్ష్మీదేవి పట్ల ఎంతో భక్తిశ్రద్ధలు కలిగిన చారుమతి, అమ్మవారిని త్రికరణ శుద్ధిగా పూజిస్తుండేది. అట్టి పతివ్రతా శిరోమణిపై “శ్రీ వరలక్ష్మి” అనుగ్రహము కలిగి ఒకనాడు స్వప్నమందు చారుమతికి ప్రత్యక్షమై శ్రావణ శుక్ల పూర్ణిమకు ముందు వచ్చే శుక్రవారాన తనను ఆరాధిస్తే కోరిన వరాలన్నీ ఇస్తానని దేవదేవి అభయమిస్తుంది.
ఈ స్వప్న వృత్తాంతమును ముందు భర్తకు, ఆపై అత్తమామలకు, ఇరుగు పొరుగు వారలకు ఎంతో సంతోషంగా చెబుతుంది. నాటి నుండి స్త్రీలందరూ వరలక్ష్మీదేవి చెప్పిన శ్రావణ మాస శుక్లపక్ష పూర్ణిమకు ముందు వచ్చే శుక్రవారం ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తుండగానే ఆ పుణ్యదినం రానే వచ్చింది.
ఆ రోజు “చారుమతి” ఇరుగు పొరుగు స్త్రీలతో కలిసి వారి వారి ఇళ్లను ముత్యాల ముగ్గులతో, పచ్చని తోరణాలతో అలంకరించుకుని, ఒక బ్రాహ్మణోత్తముని ఆహ్వానించి షోడశోపచారముతో ఆ “వరలక్ష్మీ” దేవిని చారుమతితో గూడి పూజించి వివిధ భక్ష్య భోజ్యములను ఆ తల్లికి నివేదన చేసి, ఆ తల్లికి వారంతా ప్రదక్షణ చేయగానే.. కాలి అందియెలు ఘల్లు ఘల్లుమనే శబ్దముతో లక్ష్మీదేవి వారి వారి గృహములందు ప్రవేశించింది.
ఇలా వరలక్ష్మీ దేవి అనుగ్రహంతో చారుమతితో పాటు పూజ చేసిన స్త్రీలందరూ సిరిసంపదలతో, పుత్రపౌత్రాదులతో సుఖంగా జీవించారని పరమేశ్వరుడు పార్వతీ దేవికి వివరించినట్లు స్కాందపురాణంలో కలదు.
ఇంకా.. ఈ వరలక్ష్మీ వ్రతమును అందరూ ఆచరించవచ్చునని, అట్లు వరలక్ష్మీ వ్రతమాచరించిన స్త్రీలకు అయిదోతనము, సౌభాగ్యం, సంతానప్రాప్తి వంటి సర్వశుభములు కలుగుతాయని ముక్కంటి, గిరిజకు వివరించినట్లు పురాణాలు చెబుతున్నాయి.
నమస్తేస్తు మహామామే శ్రీ పీఠే సుర పూజితే
శంఖచక్ర గదా హస్తే మహాలక్ష్మీ నమోస్తుతే”
తాత్పర్యం: మహామాయారూపిణి, శ్రీపీఠవాసిని, దేవతలు నిరంతరం సేవించే లోకమాత, శంఖ, చక్ర, గదల్ని ధరించిన మహాలక్ష్మీ దేవి అష్త్టెశ్వర ప్రదాయిని. అష్ట సంపదల్ని అందించే జగన్మంగళ దాయిని. అష్త్టెశ్వరాల్నీ కలగజేసే అష్టలక్ష్మి రూపాన్నే వరలక్ష్మీ దేవిగా మనం ఆరాధిస్తాం.
భక్తితో పూజించినవారికీ, కొలిచినవారికీ కొంగుబంగారమై వరాలనిచ్చే మహాలక్ష్మే వరలక్ష్మి. ఆమెను పై మంత్రముతో వరలక్ష్మి వ్రతమునాడు స్తుతించిన వారికి అష్టైశ్వర్యాలు చేకూరుతాయని విశ్వాసం.
అష్టలక్ష్మి దేవీలలో వరలక్ష్మీదేవికి ఓ ప్రత్యేకత ఉందని పురోహితులు అంటున్నారు. మిగిలిన లక్ష్మీ పూజలకంటే వరలక్ష్మీ పూజ శ్రేష్ఠమని శాస్త్రాలు చెబుతున్నాయి. శ్రీహరికి ఇష్టమైన, పైగా విష్ణువు జన్మనక్షత్రమైన శ్రవణం పేరిట వచ్చే శ్రావణ మాసంలో ఈ వ్రతాన్ని చేస్తే విశేష ఫలితాలు లభిస్తాయని వారు చెబుతున్నారు.
సర్వమంగళ సంప్రాప్తి కోసం, సకలాభీష్టాలకోసం, నిత్య సుమంగళిగా తాము వర్ధిల్లాలని పుణ్యస్త్రీలు ఈ వ్రతం చేస్తారు. దక్షిణ భారతదేశంలో ఈ వరలక్ష్మీ వ్రతాన్ని వివిధ సంప్రదాయాల్లో ఆచరిస్తారు.
లక్ష్మిదేవిని కొలిచే పద్ధతులు చాలా ఉన్నా.. వరలక్ష్మిదేవి పూజ జగదానందకరమైందని భక్తుల విశ్వాసం. అందుచేత సకల శుభకరమైన, మంగళదాయకమైన వరలక్ష్మి పూజను పాటించే వారికి సర్వమంగళములు చేకూరుతాయని పురాణాలు చెబుతున్నాయి

Wedding Day Greetings!

We Wish You A Happy Wedding Day Greetings..SaiCluster Apartment

Wedding Day Greetings!


Wish You A Wonderful Married Life together!!

---SaiCluster Apartment

House owners